Rescue operations in Beas River. Photo Courtesy-Indian Express |
హిమాచల్ ప్రమాదం –కారణాలు-విశ్లేషణ
హిమాచల్ ప్రదేశ్ లో June 9న బియాస్ నదిలో జరిగిన ఘటన అత్యంత దారుణం , శోచనీయం .
అప్పటి వరకు కేరింతలు ఆట పాటలతో సరదాగా
గడుపుతున్న V.N.R. Vigyanajyothi Engineering College,Bachupally,Hyderabad కి చెందిన 24 మంది యువతీ-యువకులు ,వారు ఏ నదీ ప్రవాహన్నైతే ఫోటో తీసి మరుపు రాని మధుర స్మృతిగా మార్చుకున్దాము
అనుకున్నారో ,అదే ప్రవాహం వారిని ముంచి విషాద ఛాయలు మిగిల్చింది .ఏది ఏమైనా
జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంచి భవిష్యత్తు ఉన్న యువతి-యువకులు తిరుగురాని
లోకాలకి వెళ్ళిపోయారు.ఇక వారి తల్లి-తండ్రుల పరిస్థిది చెప్పనఖ్ఖర్లేదు,ఇప్పటి
వరకు నలుగురి మృతదేహాలను వెలికితీశారు ,ఇంకా మిగిలిన వారి గురించి గాలింపు
చేపడుతున్నారు.ఈ ప్రమాదంలో చనిపోయిన పిల్లల తల్లి-తండ్రుల బాధ వారికే తెలుస్తుంది
,ఆ బాధ వర్ణనాతీతం,ఎవ్వరు ఎంత ఓదార్చిన ,ప్రభుత్వం ఎంత సహాయం చేసినా వారి నష్టం పూడ్చలేనిది.మనం చేయగలిగేది కేవలం
దేవుడు వారికి ఈ విపత్కర పరిణామాన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని ప్రార్ధించడం
మాత్రమే.
కాలం అన్ని గాయాలకు మందు అంటారు ,కాలంతో పాటు వారు నిలదోక్కుకుంటారని
ఆశిద్దాం.మరొకవైపు,ఇప్పటివరకు ఆచూకి తెలియని వారి తల్లి-తండ్రుల పరిస్థిది
అగమ్యగోచరంగా ఉంది.అసలు వారి పిల్లలు/బిడ్డలు బ్రతికి ఉన్నారో లేదో తెలవని దుస్ధితి
వారిది, ఆశ-నిరాశ మద్యలో బ్రతుకుతున్నారు ,తమ పిల్లలు ఈ ప్రమాదం నుండి ఏదో విధంగా
బయటపడ్డారేమోనని ఆశ ఒక వైపు ,వినరాని వార్త వినాలేమో అని నిరాశ మధ్య కాలం
వెళ్ళపుచ్చుతున్నారు.
జరిగిన ప్రమాదం గురుంచి
ఆలోచిస్తే ,ఈ ప్రమాదానికి అనేక కారణాలు కనబడుతున్నాయి.కర్ణుడి చావుకి లక్ష కారణాలు
అన్నట్లు, ఈ ప్రమాదానికి చాలా కారణాలు కనపడుతున్నాయి.మొదటిది, బియాస్ నదిపై,
లార్జి డ్యామ్ అధికారుల నిర్లక్ష్యం
కొట్టొచ్చినట్లు కనపడుతుంది ,ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా డ్యామ్
గేటులు ఎత్తివేయడంతో , అక్కడ ఉన్న వారికి తప్పించుకొనే అవకాశం కూడా లేకుండా
పోయింది .ముందస్తు హెచ్చరికగా సైరను మొగిందని, కాని అది విని-వినపడునట్టుగా ఉందని
కొందరు విద్యార్ధులు చెప్పుతున్నారు .ఇదే నిజమైనా,ఇటువంటి విని-వినపడని హెచ్చరిక
,దిగువున ఉన్న వారికి వారి ప్రాణాలు రక్షించుకుంటానికి ఏ మాత్రం ఉపయోగ పడుతుందో అధికారులే
చెప్పాలి.నిబంధనల ప్రకారం ,ఇటువంటి ప్రమాద హెచ్చరికలు(సైరను) కనీసం ఒకటి రెండు
కిలోమీటర్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలకి వినపడాలి. కానీ ఇక్కడ అటువంటి జాగ్రత్త అధికారులు
తీసుకున్నట్లు కనబడటం లేదు .వెనక ఎవడో ఊళ్ళో చాటింపు వేసి రారా అంటే ఇంట్లో
చాటింపు వేసి పని అయ్యింది అన్నాడట,అలా ఉంది అధికారుల తీరు.రెండవది, విహార యాత్రకు
వెళ్ళిన బృందంతో అక్కడి పరిస్ధితులు ,వాతావరణం, ప్రమాదాల గురించి అవగాహన ,పట్టు
ఉండే గైడ్ లేకపోవడం .మనకు తెలియని క్రొత్త ప్రదేశాలలో గైడ్ ఎంత అవసరమో ,కళాశాల
యాజమాన్యం గుర్తించలేకపోయింది. ఈ కాలంలో
ఎగువన ఉన్న హిమాలయాలలో మంచు కరిగి జల ప్రవాహంగా బియాస్ నదిలో కలుస్తూ
ఉంటుంది ,దీనితో నీటి మట్టం పెరిగినప్పుడల్లా డ్యామ్ గేటులు ఎత్తి నీటిని దిగువకి
వదులుతూ ఉంటారు , కనీసం రోజుకి ఒక్కసారైనా
గేటులు ఎత్తివేస్తారు. ఈ విషయం అక్కడ స్ధానికులకు తెలుస్తుంది గాని యాత్రా
బృందానికి తెలిసే అవకాశం లేదు, అదే వీరితో ఒక స్ధానిక గైడ్ ఉంటె అతడు ముందస్తుగా
ప్రమాద హెచ్చరికలు చేసేవాడేమో. ఎవరెస్టు పర్వతం ఎక్కే అత్యంత అనుభవం గల
పర్వతారోహకులు కూడా వారితో ,వారికి సహకరించడానికి స్ధానిక “షెర్పాలను”(sherpa)
బృందంతో తీసుకొని వెళ్తారు.మూడవ కారణం, చిన్నదే అయినా కొట్టిపారేయలేనిది, అది
ఉడుకు రక్తం .యువకులు-యువతులు సహజంగా రిస్కు తీసుకుంటానికి మొగ్గు చూపుతారు.అది
వారి నైజం.అందులో తప్పు ఏమి లేదు .కాని ఎక్కడ రిస్కు తీసుకో వచ్చునో,ఎక్కడ తీసుకో
కూడదో అన్న అవగాహనా ఉండాలి.నదిలోకి దిగి ఫోటోలు దిగుదాం అన్న ఆలోచన తప్ప అది ఎంత
ప్రమాదకరమో వారు ఊహించలేకపోయారు.హిమాలయ పరిసర ప్రాంతాల్లో నదులు ఇరుకుగా ఉండి
అత్యంత వేగంగా పారుతాయి, వాటి వేగం పల్లపు ప్రాంతాల్లో పారే నదులు కన్నా
మూడు-నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది,ఒక్కసారి వాటిలో చిక్కితే వాటిలో ఈదడం చాల
కష్టం .వీటితో పాటు బండ రాళ్ళ ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.ఇటువంటి ప్రమాదాలు ఉంటాయని పిల్లలు అంచనా
వేయలేకపోయారు.ఇటువంటి ప్రమాదాలు మన రాష్ట్రంలో తరచూ కృష్ణ, గోదావరి, ఇతర నదులే
కాక, పెద్ద చెరువులలో కూడా జరుగుతున్నాయి.ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి ఘటనలు
జరగకుండా తగిన జాగ్రతలు తీసుకుంటుందని ఆశిద్దాం.
ఏది ఏమైనా ఇప్పటికి ఆచూకి
లేని వారు త్వరలో క్షేమంగా బయట పడి వారి తల్లి-తండ్రులని కలుస్తారని ఆశిద్దాం.
No comments:
Post a Comment